EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

చేతిలో గొడుగు.. జనంతో అడుగు..!

ఈతరం భారతం ఆగస్ట్ 7

ఏదులాపురం మున్సిపాలిటీ : ఆకాశం వర్షిస్తోంది… వాన తుంపరలు కాలనీ బాటలను తడుపుతున్నాయి… అయినా ఆ ప్రజా సంకల్పం ఆగలేదు! వర్షం పడుతున్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా, ఒక చేతిలో గొడుగు పట్టుకుని ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగారు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. శుక్రవారం ఉదయం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 22, 23వ వార్డులైన సాయిగణేష్ నగర్, ఇందిరమ్మ కాలనీల్లో జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్‌తో కలిసి మంత్రి సాగించిన క్షేత్రస్థాయి పర్యటన పాలనకు ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది.

నడివీధి టీ కొట్టు వద్ద నలుగురిలో ఒకడై… వేడి టీ కప్పుతో ఆప్యాయ పలకరింపులు

హంగులు లేవు… ఆర్భాటాలు అసలే లేవు! పర్యటన మధ్యలో సాయిగణేష్ నగర్ వీధిలోని ఒక చిన్న టీ కొట్టు వద్ద మంత్రి ఆగిపోయారు. సామాన్య పౌరుడిలా అక్కడ ఉన్న బెంచ్ మీద ఆసీనులై, స్థానికులతో కలిసి వేడివేడి టీ తాగారు. ఆ తేనీటి కప్పు నురగల్లోంచే ప్రతి ఇంటా ఉన్న సమస్యలను ఆప్యాయంగా పలకరించారు. తాగునీటి తిప్పలు, కరెంట్ తీగల భయాలు, వర్షపు నీటి ఇబ్బందులను ప్రజలు మంత్రి ముందు ఉంచగా… ‘నేనున్నాను’ అంటూ భరోసానిచ్చారు. తమ ఊరి నేత తమ పక్కనే కూర్చుని టీ తాగుతూ కష్టసుఖాలు వినడంతో కాలనీవాసుల సంతోషం వ్యక్తం చేశారు.

రూ.100 కోట్ల నిధులతో… మోడల్ మున్సిపాలిటీగా ఏదులాపురం రూపకల్పన

ఏదులాపురం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు ఈ మంజూరు చేశారని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. గ్రామ పంచాయతీల కలయికగా ఏర్పడిన ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వర్షపు నీరు నిలిచే లోతట్టు ప్రాంతాల్లో శాశ్వత డ్రైనేజీ నిర్మాణాలు, తుమ్మ చెట్ల తొలగింపు, తాగునీటి సరఫరాను మెరుగుపరచడం వంటి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడతామని హామీ ఇచ్చారు.

ప్రజా అవసరాలే ప్రాధాన్యం… అధికారులకు ఆదేశాలు

ఇందిరమ్మ ఇళ్లు, స్థలాల కోసం ప్రజలు సమర్పించిన వినతులను ప్రభుత్వం అత్యంత సానుకూలంగా పరిశీలిస్తుందని మంత్రి పునరుద్ఘాటించారు. మున్సిపాలిటీలో కొనసాగుతున్న పార్కుల అభివృద్ధి పనులను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని, అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో ఉంటూ పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించారు.

ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఏదులాపురం మునిసిపల్ చైర్‌పర్సన్ అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మునిసిపల్ కమీషనర్ శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యుగంధర్, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ వెంకట్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాస చారి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఆర్డీఓ శ్రీనివాస్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top