ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 24 :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సమయంలో తల్లిదండ్రుల వివరాలు పొందుపరిచి మ్యాపింగ్ చేసిన వారికి కూడా కొంత మందికి నోటీసులు జారీ చేసి అందులో తాతల వివరాలు అడగడం వింతగా గోచరిస్తుంది, అంతే కాకుండా పాస్పోర్టు, 10వ తరగతి చదువుకున్న సర్టిఫికేట్ జత పరచమని కోరుతూ కేవలం 5 రోజులలో జవాబు ఇవ్వాలని కోరుతున్నారు. భారత దేశంలో పుట్టి పెరిగిన మధ్య తరగతి ప్రజలు చదువుకోకుండా, పాస్పోర్టు లేకుండా, సగటు జీవితం గడుపుతున్న వారు ఇచ్చిన కొద్ది రోజుల సమయంలోనే సమాచారం ఇవ్వని యెడల ఓటు హక్కును కోల్పోవలసి ఉంటుందా ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇట్టి నిబంధనలను సడలించి ప్రజా సౌకర్యార్థం సరళీకరణ చేయాలని భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు అందె లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు.
ఓటు నమోదు కార్యక్రమంలో ఆక్షేపణలు, అభ్యంతరాలు, దిద్దుబాటులు ఆగష్టు 17 మొదలు సెప్టెంబర్ 16 వరకూ ఉండగా వారం రోజుల గడువు గడిచినను అధికారుల పాత్ర, నిర్లక్ష్య ధోరణి వలన ఫారం 6 భౌతికముగా అందుబాటులో లేకపోవడంతో 18 సంవత్సరంలు నిండిన యువత భౌతికంగా ఫారం 6 పూరించి తమ ఓటు హక్కును పొందలేక పోతోన్నారని, అట్లాగే అనివార్య కారణాల వలన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సమయంలో అందుబాటులో లేని ప్రజలు ఫారం 6 చిక్కక ఓటు హక్కును పొందలేక పోతున్నారని అందుకు అధికారుల నిర్లక్ష్య ధోరణియే కారణమనీ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అదేవిధంగా ఓటర్ లిస్ట్లో ఉన్న లోటు పాట్లను సరి చేసుకోవడానికి, ఎక్కడో ఉన్న ఓటు హక్కును ఇక్కడకి మార్చుకోవడానికి ఫారం 8 అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు, నిరాశ నిస్పృహలకు గురౌతున్నారని పేర్కొన్నారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరిపిన అనంతరం కూడా కొంత మంది పేర్లు రెండు నియోజక వర్గాల్లో ఉన్నవని పసిగట్టడం జరిగిన దరిమిలా ఇట్టి ద్వంద పేర్ల నమోదును తొలగించడానికి ఫారం 7 భౌతికంగా అందుబాటులో లేకపోవడంతో సవరణ చేయలేక పోతున్నామని అందుకు సంబంధిత అధికారులు స్పందించి ప్రజా సౌకర్యార్థం వెంటనే ఫారం 6, 7, 8 భౌతికంగా అందుబాటులోకి తేవాలని ప్రజాసంక్షేమం, హక్కుల సాధన కొరకు భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు అందె లక్ష్మణ్ రావు డిమాండ్ చేస్తున్నారు.















