ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 24
జీవో నంబర్ 97ను వ్యతిరేకిస్తూ ఆగస్టు 25న రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. పాలిటెక్నిక్‌లను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడంపై విద్యార్థులు, అధ్యాపకుల్లో ఆందోళన ఉందని ఏబీవీపీ తెలిపింది. ఈసెట్ లేటరల్ ఎంట్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పాఠ్య ప్రణాళిక, ప్రవేశాలు, సర్టిఫికెట్లు, ఉద్యోగ అవకాశాలపై స్పష్టత కావాలని డిమాండ్ చేసింది. ఈ బంద్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చింది.తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ పునర్వ్యవస్థీకరణపై వివాదం ముదురుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను వ్యతిరేకిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల బంద్‌కుపిలుపునిచ్చినట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు తెలిపారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. జీవో 97లో భాగంగా పాలిటెక్నిక్ కాలేజీలను సాంకేతిక విద్యా శాఖ పరిధి నుంచి ఉపాధి, శిక్షణ వ్యవస్థ వైపు తీసుకెళ్లే ప్రక్రియపై విద్యార్థులు, అధ్యాపకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల ప్రభుత్వం కూడా ఈ పునర్వ్యవస్థీకరణను పరిశీలించేందుకు సాంకేతిక విద్యా మండలి, ఏఐసీటీఈ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, పాలిటెక్నిక్ లెక్చరర్ల ప్రతినిధులతో సమన్వయ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.















