ఈతరం భారతం హైదరాబాద్, సెప్టెంబర్ 27:
__________________________________
భాగ్యనగరంలో ఆదివారం ఉదయం నిర్వహించిన ‘రన్ విత్ సోల్జర్స్ – రన్ ఫర్ సోల్జర్స్’ మారథాన్ ఉత్సాహభరిత వాతావరణంలో వైభవంగా సాగింది. రక్షణ శాఖకు చెందిన సిబ్బంది, మాజీ సైనికులు, విద్యార్థులు, యువతీ యువకులతో పాటు చిన్నా పెద్దా తేడా లేకుండా వివిధ వయసుల వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
5 కి.మీ., 10 కి.మీ., 21 కి.మీ. విభాగాల్లో నిర్వహించిన ఈ మారథాన్‌లో పురుషులతో పాటు మహిళలు సైతం ఉత్సాహంగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు పాల్గొనడం విశేషం.ఈ మారథాన్‌లో ప్రముఖ కవి, బహుభాషావేత్త, ఆర్మీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ డా. పెరుక రాజుతో పాటు ఆయన యూనిట్‌కు చెందిన సైనికులు రమణ, ఉమేష్, లక్ష్మణ్, శ్రీకుమార్ తదితరులు పాల్గొన్నారు. శారీరక దృఢత్వం, క్రీడాస్ఫూర్తిని చాటుతూ మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసి పతకాలు అందుకున్నారు.
డా. పెరుక రాజుతో పాటు చిరంజీవి స్నేహిత్ కూడా మారథాన్‌లో ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. చిన్న వయసులోనే శారీరక దృఢత్వం, క్రీడాస్ఫూర్తి, సైనికుల పట్ల గౌరవాన్ని చాటుతూ అతను పరుగులో పాల్గొనడం పలువురి అభినందనలు అందుకుంది.
ఉదయం 5 గంటలకు జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో మారథాన్ ప్రాంగణం మార్మోగింది. కార్యక్రమం ఆద్యంతం దేశభక్తి, క్రీడాస్ఫూర్తితో వైభవంగా సాగింది. పాల్గొన్న వారికి అల్పాహారంతో పాటు అవసరమైన వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డా. పెరుక రాజు మాట్లాడుతూ, “ఇలాంటి కార్యక్రమాలు మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా సైనికుల పట్ల గౌరవాన్ని, దేశభక్తిని మరింత బలోపేతం చేస్తాయి. సైనికులతో కలిసి పరుగెత్తడం జాతీయ ఐక్యతకు, దేశభక్తికి ప్రతీక” అని పేర్కొన్నారు.















